ఆత్మవిశ్వాసంతో..

నేడు చెన్నైతో హైదరాబాద్‌ ఢీ
ప్రతీకారం కోసం సిఎస్‌కె
చెన్నై: వరుస విజయాలతో జోరుమీదున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మంగళవారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. మరోవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై ప్రతీకారం కోసం తహతహలాడుతోంది. ఉప్పల్‌ స్టేడియంలో తమను ఓడించిన హైదరాబాద్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో చెన్నై ఉంది. బెంగళూరుతో జరిగిన కిందటి మ్యాచ్‌లో చెన్నై చివరి బంతి వరకు పోరాడి ఓటమి పాలైంది. కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడినా తన జట్టును గెలిపించలేక పోయాడు. అయితే సొంత గడ్డపై హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో మాత్రం కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ధోని సేన ఉంది. హైదరాబాద్‌ కూడా ఇదే లక్ష్యంతో కనిపిస్తోంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో ఈ మ్యాచ్‌ కూడా నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.
అదరకొడుతున్న ఓపెనర్లు..
ఈ సీజన్‌లో హైదరాబాద్‌ ఓపెనర్లు జానీ బైర్‌స్టో, డేవిడ్‌ వార్నర్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నారు. ఇద్దరు దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ నిలకడగా ఆడుతూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇద్దరు ఇప్పటికే ఓ సారి సెంచరీలు కూడా పూర్తి చేశారు. అంతేగాక పలు మ్యాచుల్లో వందకు పైగా పరుగులు జోడించారు. హైదరాబాద్‌ సాధిస్తున్న విజయాల్లో వార్నర్‌, బైర్‌స్టోలు పోషిస్తున్న పాత్ర చాలా కీలకం. కోల్‌కతాతో జరిగిన కిందటి మ్యాచ్‌లో కూడా వార్నర్‌, బైర్‌స్టోలు జట్టుకు శుభారంభం అందించారు. ఇద్దరు పోటీ పడి ఆడుతున్నారు. దీంతో దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ హైదరాబాద్‌కు శుభారంభం దక్కుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా ఇద్దరు జట్టుకు చాలా కీలకంగా మారారు. ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా వీరికుంది. ఇద్దరిలో ఏ ఒక్కరు రాణించినా హైదరాబాద్‌కు విజయం నల్లేరుపై నడకే. ఇద్దరు కలిసి ఇప్పటికే ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు జోడించిన ఆటగాళ్లుగా రికార్డు సృష్టించారు. చెన్నైతో జరిగే మ్యాచ్‌లో కూడా జట్టుకు అండగా నిలువాలనే పట్టుదలతో ఉన్నారు.
విలియమ్సన్‌ రాణించేనా..
ఇక, కెప్టెన్‌ విలియమ్సన్‌ ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో ఆడడం లేదనే చెప్పాలి. కిందటిసారి జట్టును ముందుండి నడిపించిన విలియమ్సన్‌ ఈసారి బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. అతని వైఫల్యం జట్టుపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా విలియమ్సన్‌ తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. అతను తన మార్క్‌ బ్యాటింగ్‌తో చెలరేగితే హైదరాబాద్‌కు విజయం కష్టమేమి కాదు. ఇక, విజయ్‌ శంకర్‌, దీపక్‌హుడా,యూసుఫ్‌ పఠాన్‌, మనీష్‌పాండే తదితరులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు. వీరు ఈ మ్యాచ్‌లోనైనా మెరుగైన బ్యాటింగ్‌ కనబరచక తప్పదు. ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉన్నా ప్రయోజనం లేకుండా పోతోంది. కీలక సమయంలో జట్టుకు అండగా నిలువలేక పోతున్నారు. కీలకమైన చెన్నై మ్యాచ్‌లో మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నారు. అదే జరిగితే హైదరాబాద్‌ బ్యాటింగ్‌ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
బౌలింగ్‌లో భళా..
బ్యాటింగ్‌లో కాస్త బలహీనంగా కనిపిస్తున్నా బౌలింగ్‌లో మాత్రం హైదరాబాద్‌కు ఎదురేలేదని చెప్పాలి. స్పిన్‌, ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగాల్లో హైదరాబాద్‌ బలంగానే ఉంది. ఇటు స్పిన్నర్లు, అటు ఫాస్ట్‌ బౌలర్లు క్లిష్ట సమయాల్లో జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా ఇదే జోరును కనబరచాలనే పట్టుదలతో వీరున్నారు. సందీప్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ నబి, రషీద్‌ ఖాన్‌ తదితరులతోహైదరాబాద్‌ బౌలింగ్‌ చాలా బలంగా ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో కూడా నబి దూరంగా ఉండే అవకాశాలున్నాయి. అతనికి రషీద్‌ బరిలోకి దిగడం ఖాయం. ఇక, సందీప్‌, సిద్ధార్థ్‌కౌల్‌, భువనేశ్వర్‌ కచ్చితమైన లైన్‌ అండ్‌ లెన్త్‌తో బౌలింగ్‌ చేస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా వీరిపై జట్టు భారీగానే ఆశలు పెట్టుకుంది.
గెలుపేక్ష్యంగా.. చెన్నై
మరోవైపు చెన్నై సూపర్‌కింగ్స్‌ ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. ఉప్పల్‌లో తమను చిత్తుగా ఓడించిన హైదరాబాద్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో చెన్నై కనిపిస్తోంది. ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఆరు వికెట్ల తేడాతో చెన్నైను చిత్తు చేసిన విషయం తెలిసిందే. అయితే కిందటిసారి ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో ధోని ఉంది. కిందటి మ్యాచ్‌లో కెప్టెన్‌ చిరస్మరణీయ బ్యాటింగ్‌ను కనబరచడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన ధోని విజృంభిస్తే హైదరాబాద్‌ బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. సురేశ్‌ రైనా, డుప్లెసిస్‌, వాట్సన్‌, జడేజా, ధోని, రాయుడు తదితరులతో చెన్నై బ్యాటింగ్‌ బలంగానే ఉంది. అంతేగాక దీపక్‌ చాహర్‌, ఇమ్రాన్‌ తాహిర్‌, జడేజా తదితరులతో బౌలింగ్‌ కూడా పటిష్టంగా ఉంది. అంతేగాక హర్భజన్‌ సింగ్‌ రూపంలో పదునైన అస్త్రం ఉండనే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో చెన్నై విజయమే లక్ష్యంగా పెట్టుకుంది. ధోని సేనను ఓడించాలంటే హైదరాబాద్‌ మరింత మెరుగైన ఆటను కనబరచక తప్పదు.

DO YOU LIKE THIS ARTICLE?