ఆటోడ్రైవర్ల జీవనభద్రతపై పట్టింపులేని సర్కారు

ఆర్నెళ్ల వరకు రూ.7500 చొప్పున ప్రభుత్వం ఇవ్వాలి
తెలంగాణ రాష్ర్ట ఆటో రిక్షా డ్రైవర్స్‌ సంఘాల జెఎసి ఆధ్వర్యంలో ధర్నా
ప్రజాపక్షం/హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి వీధినపడ్డ ఆటోడ్రైవర్లకు వచ్చే ఆరు నెలల వరకు ప్రభుత్వం నెలకు రూ.7500 చొప్పున ఇవ్వాలని ఆటో రిక్షా డ్రైవర్స్‌ సంఘాల జెఎసి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఆర్‌టిఎ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ర్ట ఆటో రిక్షా డ్రైవర్స్‌ సం ఘాల జెఎసి శుక్రవారం వందలాది మంది ఆటోడ్రైవర్లతో ధర్నా నిర్వహించింది. ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరించి, వారిని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఆర్‌టిఎ కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకొని వారిని అరెస్ట్‌ చేశా రు. ఈ సందర్భంగా ఆటోడ్రైవర్లకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అంతకుముందు ఆటో యూనియన్‌ (ఎఐటియుసి) రాష్ర్ట నాయకులు వెంకటేశం మాట్లాడుతూ అసంఘటిత కార్మికులైన ఆటోడ్రైవర్ల జీవనభద్రత గురించి రాష్ర్ట ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు. లాక్‌డౌన్‌ విధించడం వల్ల తెలంగాణలో ఆటోరంగంపై ఆధారపడిన సు మారు ఆరు లక్షల కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా భయంతో ప్రజలు రోడ్లపైకి రాకపోవడంతో ఆటోలకు గిరాకీలు లేక, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా విపరీతంగా పెరగటంతో ఆటోడ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ర్ట ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటోడ్రైవర్ల కుటుంబ పోషణకు నెలకు రూ.7500 భత్యం ఇచ్చి ఆదుకోవాలని వెంకటేశం డిమాండ్‌ చేశారు. ఎండి అమానుల్లా ఖాన్‌ (టిఎడిజెఎసి) మాట్లాడుతూ లాక్‌డౌన్‌లో ప్రభుత్వసాయం సక్రమంగా అందకపోవడంతో వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకొని ఆటోడ్రైవర్లు జీవితాలను గడుపుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో సుమారు రెండు లక్షల మంది ఆటోలు నడుపుతూ తమ కుటుంబాలను పోషిస్తున్నారని, లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ఆటోలు ఎక్కడం లేదని, దీంతో ఆటోడ్రైవర్లు తమ ఆదాయాలను కోల్పోయి రోడ్డున పడుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్థికంగా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరారు. వి.కిరణ్‌ (ఐఎఫ్‌టియు) మాట్లాడుతూ లాక్‌డౌన్‌ సమయంలో ఆటో డ్రైవర్ల కన్నీటి కష్టాలను గుర్తించడంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు ఉపాధి లేక, ఆదాయం లేక, నెలసరి కిస్తీలు చెల్లించలేక ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూటికి నూరు శాతం ప్రైవేట్‌ ఫైనాన్సియర్ల ద్వారానే ఆటోలు కొనుక్కొని నడుపుతూ ఇఎంఐలు చెల్లించేవారని, గత నాలుగు నెలల నుండి లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారం లేక ఆర్థిక ఇబ్బందుల కారణంగా కిస్తీలు చెల్లించలేకపోతున్నారన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో రుణ వాయిదాలపై ఉన్న వడ్డీలను రద్దు చేసి మరో తొమ్మిది నెలల వరకు వాయిదాలను చెల్లించకుండా అవకాశం కల్పించాలని ప్రైవేట్‌ ఫైనాన్సియర్లకు ప్రభుత్వం ఆదేశించి ఆటో డ్రైవర్లను రక్షించాలని కిరణ్‌ కోరారు. ఈ ధర్నాలో ఆర్‌. మల్లేష్‌ (ఎఐటియుసి), హబీబ్‌ (ఐఎన్‌టియుసి), శ్రీను (ఐఎఫ్‌టియు) తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?