ఆంఫన్‌ విలయతాండవం

పశ్చిమ బెంగాల్‌లో తుపాను కారణంగా 72 మంది మృతి
ఉత్తర, దక్షిణ 24 పరిగణాల జిల్లాలు విధ్వంసం
కుప్పకూలిన భవనాలు, నేలవాలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు
అంధకారంలో పలు జిల్లాలు
మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సిఎం
కోల్‌కతా/భువనేశ్వర్‌ : ‘ఆంఫన్‌’ పెను తుపాను పశ్చిమ బెంగాల్‌లో విలయ తాండవం సృష్టించిం ది. తుపాను కారణంగా రాష్ట్రంలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. రెం-డు జిల్లాలు పూర్తిగా విధ్వంసం కాగా, కోల్‌కతా, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కూలిన ఇళ్ల శిథిలాలు, నేలవాలిన చెట్లతో అల్లకల్లోలంగా ఉంది. తుపాను సృష్టించిన విధ్వంసానికి వేలాది మంది ప్రజలు ఇళ్లను కోల్పోయారు. వంతెనలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వం దేళ్ల చరిత్రలో పశ్చిమ బెంగాల్‌లో పెను తుపాను విలయం తాండవం చేయగా, మట్టి ఇళ్లు, వ్యవసాయ పంటలు మట్టికరిచాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. అదే విధంగా ఒడిశాలోనూ ఆంఫన్‌ తుపాను బీభత్సానికి అనేక కోస్తా జిల్లాల్లో విద్యుత్‌, టెలికాం వంటి మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఈ తుపాను రాష్ట్రంలో దాదాపు 44.8 లక్షల మందిపై ప్రభావం చూపినట్లు ఒడిశా ప్రభుత్వ అధికారులు అంచనా వేశా రు. కాగా, ఇప్పటి వరకు అందిన నివేదికల ప్రకా రం ఆంఫన్‌ తుపాను వల్ల 72 మంది మృతి చెందినట్లు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. తుపాను పరిస్థితిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఉత్తర, దక్షిణ 24 పరిగణాల జిల్లాలు పూర్తిగా విధ్వంసమయ్యాయన్నారు. ఈ రెండు జిల్లాలను మళ్లీ నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రాకి కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించాలని తాను విజ్ఞప్తి చేస్తున్నాన్నారు. త్వరలోనే తాను తుపాను ప్రభావిత ప్రాం తాల్లో పర్యటిస్తానని,  పునరుద్ధరణ పనులను కూడా అతి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. బుధవారం సాయంత్రం నుంచి ఉత్తర, దక్షిణ 24 పరిగణాల్లోని మొత్తం ప్రాంతాల్లో, కోల్‌కతాలో విద్యుత్‌ నిలిచిపోయిందని, టెలిఫోన్‌, మొబైల్‌ వ్యవస్థ కూడా పనిచేయడం లేదన్నారు. ఇలాంటి పెను తుపాను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోడీ పర్యటించాలని ఆమె కోరారు. తుపాను కారణంగా మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరి చొప్పున రూ. 2 నుంచి 2.5 లక్షల పరిహారాన్ని ఆమె ప్రకటించారు. కాగా, మంగళవారం రాత్రి ఆమె సచివాలయం నుంచి పరిస్థితిని సమీక్షించారు. కరోనా వైరస్‌ కంటే ఆంఫన్‌ తుపాను ప్రభావం అధికంగా ఉందన్నారు. జిల్లాల్లో నెలకొన్ని పరిస్థితులను వివరిస్తూ అనేక వంతెనలు కూలిపోయాయని, విద్యుత్‌ లైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఉత్తర, దక్షిణ 24 పరిగణాలు, కోల్‌కతానే కాకుండా తూర్పు మిడనపోర్‌, హౌరా జిల్లాల్లోనూ తుపాను బీభత్సం సృష్టించిందని, అనేక ప్రాంతాల్లో పలు భవనాల్లోని కొంత భాగం కుప్పకూలాయి. కోల్‌కతాలో గంటలకు 125 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయడంతో వందలాది కార్లు ఫల్టీకొట్టాయి. అదే విధంగా చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కుప్పకూలాయి. ఫలితంగా ప్రధాన రోడ్లు, కూడళ్లలో రాకపోకలు నిలిచిపోయాయి. నగరంలోని పలు ప్రాంతాలు, తుపాను ప్రభావిత ఇతర జిల్లాలు అంధకారం ఏర్పడింది. మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలకు కూడా తీవ్ర విఘాతం కలిగింది. సమాచార వ్యవస్థకు సంబంధించిన అనేక టవర్లు దెబ్బతిన్నాయి. తుపాను ప్రభావిత జిల్లాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ప్రజలు ఆహారం కోసం ఒకరికొకరు తోసుకోవడం కపించింది. కరోనా వైరస్‌ కట్టడి నిబంధనలైన భౌతిక దూరాన్ని పునరావాస కేంద్రాల్లో పూర్తిగా విస్మరించారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5 లక్షలకుపైగా మందిని ఇప్పటికే తాత్కాలిక శిబిరాల్లోకి తరలించింది. ఉంపన్‌ తుపాను పశ్చిమ బెంగాల్‌ను అతలాకుతలం చేసిన తరువాత ప్రస్తుతం కోల్‌కతా విమానాశ్రయాన్ని తాకింది. బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌ నీట మునిగింది. ఎయిర్‌పోర్టు నీటితో నిండిపోవడంతో విమానాశ్రయం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. నీటితో నిండిన కోల్‌కతా ఎయిర్‌పోర్టు దృశ్యాలు చూస్తుంటే పెను తుపాన్‌ ఉంపన్‌ ఎంత వినాశనం కలిగించిందో తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
బంగ్లాదేశ్‌లో 10మంది మృతి
ఆంఫన్‌ పెను తుపాను దాటికి బంగ్లాదేశ్‌లో 10మంది ప్రాణాలు కోల్పోయారు. తీర ప్రాంతంలోని గ్రామాల్లో విధ్వంసం సృష్టించింది. అనేక చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. అలాగే, ఒడిశాలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు
దేశమంతా బెంగాల్‌కు అండగా ఉంది: ప్రధాని
న్యూఢిల్లీ : తీవ్ర ఉగ్రరూపం దాల్చిన పెను తపానుపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు. దేశమంతా పశ్చిమబెంగాల్‌ అండగా నిలుస్తుందని ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. పెను తుపాన్‌ ద్వారా నష్టపోయిన బాధితులకు సహాయం అందించడంలో ఏ విధంగానూ వెనుకాడమని స్పష్టం చేశారు. ‘ఆంఫన్‌ తుపాను వల్ల సంభవించిన వినాశనాన్ని పశ్చిమ బెంగాల్‌ నుంచి విజువల్స్‌ చూస్తున్నాం. ఈ కష్ట సమయంలో దేశమంతా పశ్చిమబెంగాల్‌కు అండగా ఉంటుంది. అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాం. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి’. అని ప్రధాని ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ విపత్తు సహాయక బృందాలు పనిచేస్తున్నాయని ప్రధాని అన్నారు. స్థానికంగా పరిస్థితిని ఉన్నతాధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తున్నామని ప్రధాని తెలిపారు
ప్రతి పౌరుడిని ఆదుకుంటాం: అమిత్‌ షా
ఉగ్ర రూపంతో విరుచుకుపడుతున్న ఆంఫన్‌ తుపాను వల్ల నష్టపోయిన ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలను ఆదుకుంటామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా హామీ ఇచ్చారు. గురువారం ఆయన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్‌లో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తాము కూడా ఎప్పటికప్పుడు ఆంఫన్‌ తుపాను బీభత్సంపై సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తుపాను బాధిత రాష్ట్రాలైనా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ప్రతి పౌరుడిని ఆదుకునే బాధ్యత తమ మీద ఉందన్నారు. ఇప్పటికే సహాయ చర్యల కోసం రంగంలోకి దిగిన ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. అదే సమయంలో ఎవరూ నివాసాల నుంచి బయటకు రావద్దని సూచించారు. కాగా కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఈ తుపాను విలయతాండవం వల్ల స్తంభించిపోయిన వ్యవస్థల పునరుద్ధరణ పనులు చేపట్టడం నిజంగా కష్టతరమేనని ఎన్‌డిఆర్‌ఎఫ్‌ డైరెక్ట్‌ జనరల్‌ ఎన్‌ ప్రధాన్‌ అభిప్రాయపడ్డారు.

DO YOU LIKE THIS ARTICLE?