ఆంధ్రోళ్లు రానివ్వరంటా

సరిహద్దు వద్ద వలస కూలీల పడిగాపులు
ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, చిన్నారులు
అశ్వారావుపేట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో : లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు వలస కూలీలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఇటిక బట్టీలలో పనిచేస్తున్న వారు మిరప తోటలను కోసేందుకు వచ్చిన కూలీలు, పట్టణంలోని ఇళ్లల్లో పనిచేసేందుకు వచ్చిన వలస కూలీలను గుర్తించి స్వస్థలాలకు పంపేందుకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముల్కలపల్లి, వైరా, ఖమ్మం తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న 145 మంది కూలీలను రెండు బస్సులు, ఒక వ్యాను, రెండు టాటా మ్యాజిక్‌ వాహనాలలో అశ్వారావుపేట చెక్‌ పోస్టు  వద్దకు చేర్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన ధృవపత్రాలు, స్వస్థలాలకు వెళ్లేందుకు అధికారులు ఇచ్చిన ధృవపత్రం చూపినా ఆంధ్రా అధికారులు సరిహద్దు దాటనివ్వలేదు. శనివారం రాత్రి నుంచి ఎంతగా బతిమిలాడినా అధికారులు విన్పించుకోకపోవడంతో ఇబ్బందులు పడుతూ సరిహద్దు చెక్‌పోస్టు వద్దనే కూలీలు గడపాల్సి వచ్చింది. తినడానికి తిండి లేక మండుటెండకు తాళలేక వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వరరావు, అర్‌డిఒ స్వర్ణలత ఎంతగా ప్రయత్నించినా ఆంధ్రా అధికారులు ససేమిరా అనడంతో కూలీల వివరాలను, స్థానిక పరిస్థితులను ఉన్నతాధికారులకు వివరించారు. ఒక దశలో వలస కూలీలు, ఆంధ్రా అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. వైజాగ్‌, విజయనగరం, పీఠాపురం, తుని, రాజమండ్రి, కొవ్వూరు తదితర ప్రాంతాలకు చెందిన కూలీలు లాక్‌డౌన్‌ కారణంగా ఇక్కడ పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి రావడంతో ఆనందపడ్డ వీరు సరిహద్దు వద్ద అధికారుల తీరుతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తెలంగాణ అధికారులు కూలీలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఆదివారం పొద్దుపోయే వరకు కూలీలు అశ్వారావుపేట చెక్‌పోస్టు వద్దనే ఉన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?