ఆంధ్రప్రదేశ్‌లో హోరాహోరీ బ్యాలెట్‌ సమరం

ఘర్షణల్లో ఇద్దరు మృతి
పురివిప్పిన రాజకీయ కక్షలు
చుక్కలు చూపించిన ఇవిఎంలు
పలు కేంద్రాల్లో రాత్రి 10 గంటల తర్వాత కూడా పోలింగ్‌
80 శాతం పోలయ్యే అవకాశం

ప్రజాపక్షం/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలతోపాటు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ గురువారం ఉత్కంఠభరితమైన, ఉద్రేకపూరిత వాతావరణంలో జరిగింది. పాలక తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ జరిగిన ఎన్నికల సమరంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు, దౌర్జన్యకాండ, దాడులు జరిగాయి. అనంతపురం జిల్లాలో ఒకరు, చిత్తూరు జిల్లాలో ఒకరు కోట్లాటల్లో చెరోపార్టీ కార్యకర్త మృతిచెందగా, మరికొందరు గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. దాదాపు 400 పోలింగ్‌ కేంద్రాల్లో ఇవిఎంల మొరాయింపువల్ల పోలింగ్‌ చాలా ఆలస్యంగా, కొన్నిచోట్ల మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత సైతం ప్రారంభమైంది. రాత్రి 10 గంటల తర్వాత కూడా అనేక కేంద్రాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం కొన్ని గంటలపాటు క్యూల్లో నిలబడి విసిగి వేసారి తిరిగి వెళ్లిన ఓటర్లు మధ్యాహ్నం తిరిగి ఓటింగ్‌కు రావటం ఓటు హక్కు వినియోగించుకోవాలన్న వారి పట్టుదలను చాటి చెప్పింది. ఇవిఎంలను సకాలంలో సరిచేయలేని ఎన్నికల కమిషన్‌ వైఫల్యం తీవ్ర నిరసనలకు గురైంది. ఏమైనా ఓటింగ్‌ గత రికార్డులను బద్దలకొడుతూ 80 శాతం దాటే అవకాశముంది. అధికారం నిలబెట్టుకోవటానికి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, అధికారంలోకి రావటానికి వైసిపి నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎత్తులు పై ఎత్తులతో తమతమ పార్టీ శ్రేణులను సమాయత్తం చేయటం, వివిధ తరగతుల ఓటర్లకు అనేక ఉచితాలు ప్రకటించటం ఈ ఎన్నికలను ఇరువురికీ ప్రతిష్టాత్మకంగా మార్చింది. నియోజకవర్గ స్థాయి నాయకుల పరస్పర ఫిరాయింపులు, ధనప్రవాహం కూడా ఎన్నికల్లో పోటీతత్వాన్ని పెంచాయి. రెండు పార్టీలు రేవో అన్నట్లుగా తారసిల్లటం ఉద్రిక్తతలను పెంచింది. దీని పర్యవసానమే సాంప్రదాయక ఫ్యాక్షన్‌ ప్రాంతాలతోపాటు కొత్త ప్రాంతాల్లో సైతం ఘర్షణలకు హేతువైంది.
కోడెలపై వైసిపి నేతల దాడి
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఎనమెట్ల గ్రామంలో వైసిపి నాయకులు బీభత్సం సృష్టించారు. ఎపి అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలింగ్‌ సరళి పరిశీలనకు వచ్చిన కోడెలపై వైసిపి కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేశారు. కోడెల చొక్కా చింపేశారు. ఈ దాడిని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధుల ఫోన్లు లాక్కొని చితకబాదారు. ఈ దాడిలో గాయపడిన కోడెల

DO YOU LIKE THIS ARTICLE?