ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌ చేయబోం

ఇవ్వమని కోరుతాం
హోదాపై ఎప్పుడూ ప్రధానికి గుర్తు చేస్తూనే ఉంటాం
ప్రధాని మోడీతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ
రాష్ట్ర విభజన నాటికి
రూ. 97 వేల కోట్ల అప్పులు
గత ఐదేళ్లలో ఆ అప్పు రూ. 2058 లక్షల కోట్లకు చేరిక
ఏడాదికి చెల్లించే వడ్డీయే రూ. 20 వేల కోట్లు
పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తాం!

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమికి పూర్తి మెజారిటీ వచ్చినందున, ఇతరుల అవసరంలేకుండానే కేంద్ర ప్రభుత్వం వస్తున్నందున ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేయలేమని..కాకపోతే కోరతాం అని ఆంధ్రప్రదేశ్‌కు కాబోతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన నాటికి రూ. 97 వేల కోట్ల అప్పులుంటే… ఈ ఐదేళ్లలో చంద్రబాబు హయాంలో ఆ అప్పు రూ. 2.58 లక్షల కోట్లకు చేరుకుందని, ఆంధ్రప్రదేశ్‌ అప్పులపై చెల్లించే వడ్డీయే సంవత్సరానికి రూ. 20,000 కోట్లు అని ఇక్కడ నరేంద్ర మోడీతో సమావేశమైనప్పుడు ఆయన తెలిపా రు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి గురువారం అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైనప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపట్ల ఉదారంగా వ్యవహరించాల్సిందిగా కోరినట్లు కూడా జగన్‌ చెప్పారు. ‘నేడు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కకపోవచ్చు. కానీ ప్రధాని మోడీకి ఈ విషయాన్ని ఎప్పుడు కలిసినా గుర్తు చేస్తూనే ఉంటాం. ఏదో ఒక రోజు ప్రత్యేక హోదా రాష్ట్రానికి వస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు. 7,లోక్‌ కళ్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని అధికార నివాసంలో ఆయనని జగన్‌ కలిశాక విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు.
ఎన్‌డిఎకు పూర్తి మెజార్టీ…కనుక డిమాండ్‌ చేయలేం
‘ఈ ఎన్నికల్లో ఎన్‌డిఎకు 250కు మించి సీట్లు రాకూడదని కోరుకున్నాం. ఆ కూటమికి 250లోపు సీట్లు వస్తే హోదాపై సంతకం పెట్టేవారేమో! ఎన్‌డిఎకు పూర్తి మెజారిటీ(353 సీట్లు) రావడం కొంత బాధగా ఉంది. వారికి సీట్లు తగ్గితే ప్రత్యేక హోదా సాధన తీవ్రతరం చేసేవాళ్లం. ఇతరుల అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం వస్తోంది. విభజన హామీలను కలిసి సాధిద్దామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్‌ రావు ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై తెరాస ఎంపీలు ఎపితోనే ఉంటారని కెసిఆర్‌ స్పష్టంగా చెప్పారు. తెలుగు రాష్ట్రాల సమస్యలపై వైకాపా, తెరాస ఎంపీలు (31 మంది) కలిసి నడుస్తారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదు. ఈ విషయాన్ని సంఘం ఛైర్మన్‌ వై.వి.రెడ్డి, సభ్యులు లిఖిత పూర్వకంగా తెలిపారు. చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు’ అన్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి బిజె పి అధ్యక్షుడు అమిత్‌ షాను కూడా కలుసుకున్నారు. ‘దేశంలో మోడీ తర్వాత రెండో అతిశక్తివంతమైన వ్యక్తి అమిత్‌షానే అనుకుంటున్నా’ అని జగన్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన డిమాండ్ల విషయంలో ఆయన మద్దతును కోరతానని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?