అల్వార్‌లో నిరుద్యోగులెందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు?

ఉద్యోగకల్పనపై మోడీని నిలదీసిన రాహుల్‌

అల్వార్‌: ఉద్యోగ కల్పన విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మంగళవారం ధ్వజమెత్తారు. రాజస్థాన్‌ ఎన్నికల సభలో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 2కోట్ల యువతకు ఉద్యోగాలు కల్పిస్తానన్న ప్రధాని మోడీ మాట మరిచారన్నారు. ‘ఒకవేళ ఆయన ఉద్యోగాలు ఇచినట్లయితే అల్వార్‌ జిల్లాలోని మాలఖేరలో పట్టణంలో నలుగురు యువకులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నట్లు?’ అని ప్రశ్నించారు. అల్వార్‌ జిల్లాలో గత నెల ఆ యువకులు నడుస్తున్న రైలు నుంచి దుమికేసారు. వారు ఓ ఆత్మహత్య నోటును కూడి విడిచారు. ప్రాథమిక విచారణలో వారు ఉద్యోగాలు దొరక్కపోవడంతో విసుగెత్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాని తన సభల్లో ‘భారత్‌ మాతాకీ జై’ అంటారు. కానీ అనిల్‌ అంబానీ వంటి వారికోసం పనిచేస్తుంటారు’ అన్నారు. ‘ఆయన ఇకపై అనిల్‌ అంబానీకి జై, మెహుల్‌ చోక్సీకి జై, నీరవ్‌ మోడీకి జై, లలిత్‌ మోడీకి జై’ అని నినదించడం బాగుంటుందని రాహుల్‌ చెప్పారు. ‘భారత్‌ మాతా’ గురించి రాహుల్‌ ప్రస్తావిస్తూ ‘భారత్‌ మాతా అన్న ది రైతులు, యువత, మహిళ లు, శ్రామికులు.. దేశంలోని అందరి సెంటిమెంట్‌’ అ న్నారు. ‘భారత్‌ మాతా గు రించి మాట్లాడే మీరు రైతు ల గురించి ఎందుకు మరచిపోతున్నారు?’ అని నిలదీశా రు. ఎంపిక చేసుకున్న కొంద రు పారిశ్రామికవేత్తల రుణాలు రూ. 3.5 లక్షల కోట్లను మాఫీ చేసిన మోడీ ప్రభుత్వం రైతులకు రూపాయి కూడా రుణమాఫీ కూడా చేయలేదన్నారు. తాను రాఫెల్‌ కుంభకోణం గురించి మాట్లాడాలనుకుంటున్నప్పుడల్లా ప్రేక్షకుల నుంచి ఎవరో ఒకరు ‘కాపలాదారుడు దొంగ’(చౌకీదార్‌ చోర్‌ హై) అన్న మాట వినపడుతుందన్నారు. మోడీ ప్రభుత్వం దేశంలోని 15 మంది ప్రధాన పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తోందని రాహుల్‌ ఆరోపించారు. రాహుల్‌ ఎన్నికల సభలో కాంగ్రెస్‌ రాజస్తాన్‌ యునిట్‌ అధ్యక్షుడు సచిన్‌ పైలెట్‌, మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?