‘అర్జున’కు ఆ నలుగురి పేర్లు

ముంబయి: ప్రతిష్ఠాత్మక అర్జున పురస్కారానికి నలుగురు క్రికెటర్ల పేర్లను భారత క్రికెట్‌ మండలీ (బిసిసిఐ) ప్రతిపాదనలు పంపింది. అందులో మహిళా క్రికెటర్‌తో పాటు ముగ్గురు పురుష క్రికెటర్ల పేర్లను అర్జున అవార్డు -2019కు బిసిసిఐ సిఫార్సు చేసింది. టీమిండియా క్రికెటర్లలో స్టార్‌ బౌలర్లు జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా పేర్లను ప్రతిపాదించగా.. మహిళా క్రికెటర్లలో పూనమ్‌ యాదవ్‌ పేరును పంపింది. సుప్రీం కోర్టు నియమించిన పాలకుల కమిటీతో క్రికెట్‌ జిఎం సాబా కరీమ్‌ సమావేశమై వీరి పేర్లను సిఫార్సు చేశారు. ఇటీవలి కాలంలో బుమ్రా టీమిండియాలో బాగా రాణిస్తున్నాడు. అద్భుతమైన బౌలింగ్‌తో వన్డేల్లో ప్రపంచ నంబర్‌ వన్‌ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్లోనూ బుమ్రా మెరుగైన ప్రతిభ కనబర్చుతున్నాడు. తన స్పేషలిస్ట్‌ యార్కర్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు. దీంతో పాటు మరి కొన్ని రోజుల్లో జరగబోయే ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున కీలక పేసర్‌ పాత్ర పోషించనున్నాడు. మరో ఫాస్ట్‌ బౌలర్‌ షమీ కూడా టీమిండియాలో మెరుగ్గా రాణిస్తూ ప్రపంచకప్‌ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఇక ఆల్‌ రౌండర్‌ జడేజా సైతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నిలకడగా ఆడుతున్నాడు. ఇతడు కూడా వరల్డ్‌ కప్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మహిళా క్రికెటర్‌ పూనమ్‌ యాదవ్‌ కూడా మంచి ఫామ్‌ను కనబర్చుతోంది.

DO YOU LIKE THIS ARTICLE?