అయోధ్య భూవివాదంలో మధ్యవర్తిత్వం

సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌
జస్టిస్‌ ఎఫ్‌ఎంఐ ఖలీఫుల్లా నేతృత్వంలో మధ్యవర్తిత్వ ప్యానెల్‌
సభ్యులుగా శ్రీశ్రీ రవిశంకర్‌, సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్‌ పంచు
ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో విచారణ ప్రక్రియ
విచారణను 8 వారాల్లో పూర్తి చేయాలని గడువు

న్యూఢిల్లీ: సామరస్యపూర్వకంగా వివాదానికి పరిష్కారం కనుగొనేందుకు అయోధ్య భూవివాదం కేసును రిటైర్డ్‌ సుప్రీంకోర్టు జడ్జి ఎఫ్‌ఎంఐ ఖలీఫుల్లా నేతృత్వంలోని మధ్యవర్తిత్వ ప్యానెల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం అప్పగించింది. విచారణ ప్రక్రియను ఎనిమిది వారాల్లోగా పూర్తిచేయాలని కూడా గడు వు పెట్టింది. కాగా మధ్యవర్తిత్వం నెరిపే ఈ సం ఘంలో ఇతర సభ్యులుగా ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌, సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్‌ పంచు ఉన్నారు. ఇదిలావుండగా ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అవసరమైతే మరి కొందరు సభ్యులను కూడా ప్యానెల్‌లో చేర్చుకుంటాం(కో-ఆప్ట్‌) అని తెలిపింది. మధ్యవర్తిత్వం నెరిపేందుకు ప్యానెల్‌కు ఇరుపక్షాలు మధ్యవర్తుల పేర్లను సూ చించాయి. అయోధ్య కేసులో మధ్యవర్తిత్వం నిర్ణ యం తీసుకున్న రాజ్యాంగా ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎస్‌ఎ బోబ్డే, డివై చంద్రచూడ్‌, అశోక్‌ భూషణ్‌, ఎస్‌ఎ నజీర్‌ ఉన్నారు. మధ్యవర్తిత్వం విచారణ ప్రక్రియ ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చూడాలని రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. విషయాన్ని మధ్యవర్తిత్వానికి అప్పగించే సందర్భంలో ధర్మాసనం ‘పరిష్కారం కుదిరేందుకు విషయాన్ని మధ్యవర్తిత్వానికి అప్పగించడంలో చట్టపరమైన ఇబ్బందులేవి లేవు’ అని పేర్కొంది. మధ్యవర్తుల కమిటీ జరిపే విచారణను రికార్డు చేయాలని ధర్మాసనం పేర్కొంది. అయితే మధ్యవర్తుల కమిటీ విచారణను రహస్యంగా(ఇన్‌-కెమెరా) నిర్వహించాలని, మీడియాకు వెల్లడించకూడదని, ఎనిమిది వారాల్లోగా విచారణ ప్రక్రియను పూర్తిచేయాలని ఆంక్షలు విధించింది. మధ్యవర్తిత్వ విచారణ ప్రక్రియ వారంలోగా…శుక్రవారం నుంచి ఆరంభం కాగలదని కూడా ధర్మాసనం పేర్కొంది. విచారణ ప్రక్రియ వార్తలను ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా ఏవీ కూడా ప్రచురించడం, ప్రసారం చేయకూడదని స్పష్టం చేసింది. ఏదైనా ఇబ్బంది ఎదురైతే ప్యానెల్‌ ఛైర్మన్‌ ఆ విషయాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి తెలపాలని రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది.

DO YOU LIKE THIS ARTICLE?