అమ్మో.. ఆగస్టు

గోదావరి ఉగ్రరూపం
ఏజెన్సీ ప్రాంతాన్ని చుట్టుముడుతున్న వరదలు
గతం తల్చుకుంటేనే భయం… భయం..
ప్రజాపక్షం/భద్రాచలం వరద ప్రమాదం భద్రాద్రి ఏజెన్సీకి పొంచి ఉంది. ఈ ఏడాది గత నెలలో గోదావరికి వరద వచ్చి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయగా, ఆ తర్వాత వెనక్కు తగ్గింది. ఇక ఆగస్టు వరదలు అంటే ఇక్కడి ప్రజలకు అంతా ఇంతా భయం కాదు, గోదావరి నదికి భయంకరమైన వరదలు ఈ నెల్లోనే వచ్చాయి. 1953 నాటి వరదల ఎం తో ప్రాణ నష్టాన్ని మిగిల్చియి. 1986లో మరోసారి సంభవించిన గోదావరి వరదలను చూసిన వారంతా ఆ నాటి పరిస్థితులను వివరిస్తూ పడిన కష్టాలను, నష్టాలను చెబుతుంటే ఒళ్లు గగ్గుర్లు పొడవక మానదు. 1986 ఆగస్టు 13న సుమా రు 25 అడుగుల వరకు ఉన్న వరద రెండు రోజుల్లోనే ఉగ్రరూపం దాల్చింది. 14వ తేదీన మొద టి ప్రమాద హెచ్చరిన (48 అడుగులు), రోజు రాత్రి రెండో ప్రమాద హెచ్చరికను (53 అడుగులు), ఆ తరువాత మూడో ప్రమాద హెచ్చరికను (58 అడుగులు) దాటేసింది. 15వ తేదీన తెల్లవారే వరకు ఏకంగా 75.6 అగులకు చేరుకుంది. ఆ నాటి నుండి ఈ నాటి వరకు అతిపెద్ద వరద ఇదే. అప్పట్లో ఈ ప్రాంతం పూర్తిస్థాయిలో వెనుకబడి ఉంది. భారీ ప్రాణ నష్టం వాటిల్లింది. పశువులు, ధాన్యం, కట్టుకున్న ఇళ్లు, ఆస్తులు అన్నీ గోదారి పాలయ్యాయి. చాలా మంది వరద తగ్గుముఖం పడుతుందిలే అని భావించి ఇళ్ల పైకి ఎక్కి కూర్చున్నారు. కానీ వరద అంతకంతకూ పెరిగిపోవడంతో నీళ్లలో కొట్టుకుపోయారు. కూనవరం, విఆర్‌ పురం, భద్రాచలం, దుమ్ముగూడెం ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఎదురైంది. కొందర్ని పడవల సహాయంతో కాపాడగలిగినప్పటికీ, మరి కొందరి ప్రాణాలు గోదాట్లో కలిసిపోయాయి. కళ్లముందే అయినవారు, పెంచుకున్న పశుసంపద కొట్టుపోతుంటే చేసేది లేక చేష్టలుడికి కూర్చోవాల్సి వచ్చింది. ఊర్లకు ఊర్లు తుడుచిపెట్టుకుపోయాయి. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండగా, రాజీవ్‌ గాంధీ ప్రధానిగా, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారిరువురు ఈ ప్రాంతానికి స్వయంగా వచ్చి ఇక్కడ పరిస్థితిలను పలిశీలించారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు నిత్యావసరాలతోపాటు నగదు రూపేనా సహాయాన్ని అందించారు. ఇళ్లు, ఆస్తులు కోల్పోయిన వారికి ప్రభుత్వ లెక్కల ప్రకారం నష్ట పరిహారం చెల్లించారు. చాలా మంది అనారోగ్యాల పాలై మృత్యువాత పడ్డారు. కానీ ఆనాటి భయానక పరిస్థితుల నుండి ఏజెన్సీ ప్రజలు కోలుకోవడానికి సుమారు పదేళ్లు పట్టింది. ఈ సారి కూడా ఆగస్టు మాసం ప్రవేశించడంతో ఇక్కడి వారిని వరద భయం వెంటాడుతోంది.
ఆగస్టుల్లో గోదావరికి వచ్చిన అత్యధిక వరదలు ఇవే
1953లో నుండి మొదలుకుని ఇప్పటి వరకు మూడో ప్రమాద హెచ్చరిక దాటి 16 సార్లు వరద వచ్చింది. 1983 ఆగస్టు 15న 75.6 అడుగుల వరద వచ్చింది. ఇదే అతి పెద్ద వరద, అంతకంటే ముందు 1953లో 72.05 అడుగులు, 1990 ఆగస్టు 24న 70.08 అడుగులు, 2006 ఆగస్టు 6న 66.09 అడుగుల వరద ఇప్పటి వరకు గోదావరికి వచ్చింది. కాగా 1984లో అధికారులు గోదావరి ఉరవడిని దృష్టిలో పెట్టుకుని భద్రాచలం, కూనవరం వద్ద ప్రమాదహెచ్చరికల వరద మట్టాన్ని నిర్ధారించారు. ఆ నాటి లెక్కల ప్రకారం 43 అడుగులకు వరద చేరుకుంటే మొదటి ప్రమాదహెచ్చరిక, 48 అడుగుల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, 58 అడుగులను దాటి ప్రవహించే మూడో ప్రమాదహెచ్చరికగా నిర్ధారించారు.

DO YOU LIKE THIS ARTICLE?