అధికారంలోకి వస్తే మహిళా బిల్లు

కొచ్చి : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే, పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. మంగళవారం కేరళలోని కొచ్చిలో జరిగిన బూత్‌స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును తాము ఆమోదిస్తామని చెప్పారు. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే చేసే మొదటి పని పార్లమెంటు, శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించడమని చెప్పారు. ఈ బిల్లును 2010లో రాజ్యసభలో ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా, ఎక్కువ మంది మహిళా అభ్యర్థులకు టికెట్లు కేటాయించాలంటూ పార్టీ కార్యకర్తలు చేసిన సూచనపై రాహుల్‌ స్పందిచా రు. మహిళలను నాయకత్వ స్థానాల్లో చూడాలనుకుంటున్నట్లు తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందుప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసినట్లు ఈ సందర్భంగా రాహుల్‌ గుర్తుచేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి మద్దతివ్వాలని కోరానన్నారు.ఈ బిల్లును ఎనిమిదేళ్ళ నుంచి ఏదో ఒక సాకు చెబుతూ ఆమో దం పొందకుండా చేస్తున్నారని ఆరోపించారు.

DO YOU LIKE THIS ARTICLE?