అదొక గొప్ప సంస్కరణ

అంతరిక్షంలోకి ‘ప్రైవేటు’పై ఇస్రో శివన్‌

న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు కంపెనీలను అనుమతిస్తూ భారత ప్రభు త్వం తీసుకున్న నిర్ణయం మంచిదేనని భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చైర్మన్‌ కె.శివన్‌ వ్యాఖ్యానించారు. రాకెట్లు, శాటిలైట్ల నిర్మాణం, ప్రయోగ సేవలను కల్పించడం వంటి అంతరిక్ష కార్యకలాపాల నిర్వహణకు గాను ప్రైవేటురంగానికి అనుమతినివ్వడం జరుగుతుందని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అంతరిక్ష రంగంలోకి ప్రైవేటువారికి అనుమతినివ్వడం అనేది అతిపెద్ద సంస్కరణగా అభివర్ణించారు. ‘ఇప్పటికే కొన్ని స్టార్టప్‌ కంపెనీలు మమ్మల్ని సంప్రదించాయి. గ్లోబల్‌ స్పేస్‌ ఎకానమీకి ఇండియా హబ్‌ గా మారుతుందని బలంగా నమ్ముతున్నా. అంతరిక్ష సంబంధిత విషయాలు పాలుపంచుకునేందుకు ప్రైవేటు కంపెనీలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా, ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలను యువత వినియోగించుకుంటుందని భావిస్తున్నా’ అని అన్నారు. ఇస్రో గ్రహాంతర మిషన్లకు కూడా ప్రైవేటు సంస్థలు సాయం చేయవచ్చని అన్నారు. ఇస్రో అన్ని రకాలుగా కొత్త సంస్థకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని చెప్పారు. కొత్త సంస్కరణలు భారత అంతరిక్షంలో ఇస్రో పాత్రను తగ్గించవని పేర్కొన్నారు. ‘ఇస్రో ప్రయోగాలు నడుస్తూనే ఉంటాయి. ఆర్‌ అండ్‌ డీ, వేరే గ్రహాలపైకి ప్రయోగాలు, మానవ సహిత అంతరిక్ష యాత్రలు తదితరాలు ఎప్పటిలానే ఉంటాయి’ అని తెలిపారు. అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు సంస్థలను అనుమతిస్తూ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినేట్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ అథరైజేషన్‌ సెంటర్‌(ఐఎన్‌ పీఏసీఈ)ను ఏర్పాటుకు కూడా అనుమతి ఇచ్చింది. ఇది ప్రైవేటు కంపెనీలకు, భారత ప్రభుత్వ అంతరిక్ష సంబంధిత ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ ను వాడుకునేందుకు అనుమతులు జారీ చేస్తుంది. ఐఎస్‌ఎస్‌పీఏసీఈను పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని శివన్‌ వెల్లడించారు.

DO YOU LIKE THIS ARTICLE?