అఖిలపై ఆధారాలు

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
మాజీ మంత్రి అఖిలప్రియ ప్రమేయం ఉన్నట్టు ఆధారాలున్నాయి
మీడియాకు వెల్లడించిన సిపి అంజనీకుమార్‌
అఖిలప్రియకు మూడురోజుల కస్టడీ
ప్రజాపక్షం/హైదరాబాద్‌ బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో పోలీసులు మరో ముగ్గ్గురిని అరెస్టు చేశారు. నిందితులు ఉపయోగించిన సెల్‌ఫోన్లను, నకిలీ నంబర్‌ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ పర్సనల్‌ అసిస్టెంట్‌ బోయా సం పత్‌ కుమార్‌ (22), భార్గవ్‌రామ్‌ పర్స్‌నల్‌ అసిస్టెంట్‌ మల్లికార్జున్‌ రెడ్డి,(32), డ్రైవర్‌ బాలా చెన్నయ్య(30)లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మాజీ మంత్రి అఖిలప్రియ సూచన మేరకే నిందితులు ప్రవీణ్‌రావు ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని, కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను అంజనీకుమార్‌ వెల్లడించారు. అఖిలప్రియ సూచన మేరకు మల్లిఖార్జున్‌రెడ్డి మియాపూర్‌లోని ఎస్‌ఎ.మొబైల్‌ షాప్‌ నుంచి ఆరు సిమ్‌కార్డులను కొనుగోలు చేశాడు. ఈ సీమ్‌కార్డులలో రెండు మాదాల శ్రీను, అఖిలప్రియ కూడా ఉపయోగించారు. కిడ్నాపర్ల వద్ద ఉన్నఫోన్‌ నంబర్‌ నుంచి అఖిలప్రియకు కూడా ఫోన్‌ కాల్స్‌ వెళ్లాయి. కాగా ఆరు సిమ్‌ కార్డుల లొకేషన్స్‌,టవర్స్‌లను గుర్తించామని, అఖిల ప్రియ ఆధ్వర్యంలో కిడ్నాప్‌కు ముందే రెక్కీ నిర్వహించారని, రెక్కీ ఆపరేషన్‌లో బాలా చెన్నయ్య కూడా ఉన్నారని అంజనీకుమార్‌ వెల్లడించారు. వీరంతా కూకట్‌పల్లిలోని ప్రదా గ్రాండ్‌ హోటల్‌లో బస చేశారని, అఖిలప్రియ సమక్షంలోనే ఈ ఆపరేషన్‌ మొత్తం జరిగిందని వివరించారు. జనవరి 5న జరిగిన కిడ్నాప్‌లో భూమా అఖిల ప్రియ ఫోన్‌లో మాట్లాడిన సెల్‌ ఫోన్‌ ఆధారాలను సేకరించామని, అలాగే కిడ్నాప్‌ జరిగిన రోజు రాత్రి కిడ్నాపర్ల నుంచి డిసిపికి కూడా ఫోన్‌ వచ్చిందని, ప్రవీణ్‌ సోదరులను వదిలేస్తున్నట్లు కిడ్నాపర్లు ఫోన్‌లో తెలియజేశారని పేర్కొన్నారు. గుంటూరు శ్రీనుతో భార్గవరామ్‌ టచ్‌లో ఉన్నారన్నారు. ఈ కేసులో మొత్తం 19 పేర్లు ఉన్నాయన్నారు. మహిళ పోలీస్‌ అధికారులు లేకుండా అఖిలప్రియను అరెస్ట్‌ చేసినట్టుగా చెప్పడం అవాస్తవమని, ఇద్దరు మహిళా అధికారుల సమక్షంలోనే అఖిలప్రియను అరెస్ట్‌ చేశామన్నారు. అఖిల ప్రియకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారని, ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్టు వైద్య నివేదికలో వెల్లడైందని, దీనిని న్యాయస్థానానికి సమర్పించామని అంజనీకుమార్‌ తెలిపారు.
అఖిలప్రియకు మూడురోజుల కస్టడీ
బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలు మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు సోమవారం విచారించారు. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని అఖిలప్రియ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయగా, ఈ కేసు విచారణ నిమిత్తం అఖిలప్రియను ఏడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్లపై వాదనలు విన్న సికింద్రాబాద్‌ న్యాయస్థానం అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌ను తిర్కరించింది. అలాగే పోలీసులు అడిగన ఏడు రోజుల కస్టడీ విచారణను మూడు రోజులకే అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. దీంతో అఖిలప్రియను బోయిన్‌పల్లి పోలీసులు సోమవారంనాడే తమ కస్టడీకి తీసుకుని, ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడి నుంచి బేగంపేటలోని మహిళాపోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను, దీనికి సంబంధించిన ఆధారాలు, ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?