అకాల వర్షంతో భారీ నష్టం

ప్రజాపక్షం / హైదరాబాద్‌: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రైతుల వేదన అరణ్య రోదనే అవుతోంది. ప్రజాప్రతినిధు లు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం దక్కడం లేదు. దీంతో రైతులు రోడ్డెక్కి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. సకాలంలో కొనుగోళ్లు లేక, గిట్టుబాటు ధర లు రాక రైతులు నష్టాల ఊబిలో చిక్కుకుని విలవిలలాడిపోతున్నారు. మరోవైపు కరోనా లాక్‌డౌన్‌ వారిపాలిట శాపంలా మారింది. దీనికి తోడు అకాల వర్షాలు వారి పుట్టిముంచుతున్నాయి. ఒక వైపు అమ్ముకోవడానికి కష్టాలు పడుతుండగా మరో వైపు కొనుగోళ్లలో జరుగుతున్న మోసాలకు వారు కుదేలవుతున్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం యాడారం గ్రామానికి చెందిన దేవరాజు అనే రైతు ధాన్యం అమ్ముకోవడానికి వచ్చి రాశిపైనే కన్ను మూశాడు. అతను గత 15  రోజులుగా ధాన్యాన్ని మార్కెట్‌కు విక్రయించుకోవడానికి వస్తూనే ఉన్నారు. వారం రోజులుగా కొనుగోలు చేయడం లేదు. ఆయన వంతు రాకపోవడంతో మార్కెట్‌లో వేసిన ధాన్యాన్ని రక్షించుకోవడానికి రాత్రి పగలు అక్కడే ఉంటున్నారు. మంగళవారం కూడా ధాన్యాన్ని చూసుకోవడానికి రాగా అప్పుడే ఒక్క సారిగా వర్షం మొదలయింది. దీంతో ధాన్యాన్ని తడవకుండా కాపాడుకునేందుకు కుప్పలుగా చేయడంలో నిమగ్నం కాగా, ఒక్కసారిగా పిడుగు పడింది. ఆ శబ్దానికి ధాన్యం రాశిపైనే కుప్పకూలి చనిపోయారు. వారం రోజుల క్రితం కామారెడ్డి జిల్లాలోనే పోచంపల్లికి చెందిన భూమయ్య అనే రైతు మార్కెట్‌లో ధాన్యాన్ని ఆరబెడుతుండగా ఒక్కసారి గుండెపోటు వచ్చి ఆసుపత్రికి తరలించక ముందే మరణించాడు. దీంతో కామారెడ్డి జిల్లాలో కొనుగోళ్లు సకాలంలో జరగకపోవడంతో మరణించిన రైతుల సంఖ్య రెండుకు పెరిగింది. మార్కెట్లలో రోజుల తరబడి వారి ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడంతోనే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగళ్లు, ఈదురు గాలులతో కూడిన వర్షంతో పాటు భారీ వర్షాలు కురియడంతో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లగా మామిడి రాలి ఏకంగా 4వేల హెక్టార్లలో రైతులు నష్టపోయారు. ప్రధానంగా రాయకల్‌ మండలంలో పంట నష్టం బాగా జరిగింది. కరీంనగర్‌ జిల్లాలో గంభీరావుపేటలో భారీ వర్షానికి అత్యధికంగా పంట నష్టం జరగగా మరో నాలుగు మండలాల్లో మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న, వరి పంటలకు నష్టం వాటిల్లగా అత్యధికంగా కల్లూరు, లింగాలపల్లిలలో ఎక్కువ నష్టం వాటిల్లింది. మంగళవారం కురిసిన వర్షానికి ఆదిలాబాద్‌ జిల్లాలో పంటనష్టం జరగగా నిర్మల్‌ జిల్లాలో పసుపు పంటకు భారీ నష్టం వాటిల్లింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనూ వర్షానికి పంట నష్టం పెద్ద ఎత్తున సంభవించింది. దుబ్బాక, పెన్నాడి మండలాల్లో పంట నష్టం ఎక్కువగా జరిగింది. సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో కురిసిన భారి వర్షానికి మిర్చి పంటకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లగా మిగిలిన ఇతర పంటలకు కూడా దెబ్బతిన్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మహబూబాబాద్‌, ములుగు జిల్లాల్లో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. నిర్మల్‌ జిల్లాలోని గొడిసిర్యాల్‌లో పంటపొలాల్లో విద్యుత్‌ తీగలు తెగిపడి పది గేదెలు మృతి చెందాయి. మంచిర్యాల జిల్లాలోని ఈదురుగాలులతో కూడిన వర్షానికి మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులకు జరుగుతున్న కష్టానికి, నష్టానికి కొనుగోళ్లు సకాలంలో జరగకపోవడం, మార్కెట్‌లలో సౌకర్యాలు లేకపోవడం, మిల్లర్లు ఇష్టారీతిన కోతలు విధిస్తుండడమే ప్రధాన కారణం. అధికారులు కూడా మిల్లర్లతో కుమ్ముక్కై వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?