అంతరిక్షంలోకి జెఫ్‌ బెజోస్‌

బ్లూ ఆరిజిన్‌ న్యూ షెపర్డ్‌ రాకెట్‌ ద్వారా అమెజాన్‌ అధినేత యాత్ర విజయవంతం
వ్యాన్‌ హార్న్‌ (అమెరికా): అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ మంగళవారం చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. వారం రోజుల్లో నే సొంత స్పేస్‌క్రాఫ్ట్‌ ద్వారా అంతరిక్ష యాత్ర చేసిన రెండో కోటీశ్వరుడిగా బెజోస్‌ నిలిచిపోయారు. కాగా ఈ యాత్రలో బెజోస్‌ వెంట ఆయన సోదరుడు మార్క్‌, నెదర్లాండ్స్‌కు చెందిన 18 ఏళ్ల ఆలివర్‌ డేమన్‌, టెక్సాస్‌కు చెందిన 82 ఏళ్ల వాలీ ఫంక్‌ ఉన్నారు. వీరిలో డేమన్‌ అంతరిక్షంలోకి వెళ్లిన అతి పిన్న వయసు కలిగిన వ్యక్తి కాగా, ఫంక్‌ అతిపెద్ద వ్యక్తి కావడం విశేషం. సొంత అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్‌కు చెందిన న్యూ షెపర్డ్‌ రాకెట్‌ ద్వారా బెజోస్‌ ఈ అంతరిక్ష యాత్ర నిర్వహించారు. గతవారం వర్జిన్‌ గెలాక్టిక్‌కు చెందిన రిచర్డ్‌ బ్రాన్సన్‌ విజయవంతంగా రోదసి యాత్ర చేసిన విషయం తెలిసిందే. బ్లూ ఆరిజిన్‌ స్పేస్‌ క్యాప్సూల్‌ దాదాపు 106 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. ఈ సమయంలో ప్రయాణికులు భారరహిత స్థితిని పొందారు. ఈ కార్యక్రమం పూర్తయ్యేందుకు 10 నిమిషాలు పట్టింది. యాత్ర కోసం 2 కోట్ల 80 లక్షల డాలర్లతో వేలం పాట గెలుచుకున్న తొలి వ్యక్తి మాత్రం ప్రయాణంలో పాల్గొనలేదు. ఆయన తర్వాత యాత్రను ఎంచుకున్నారు. అంతరిక్ష యాత్రల కోసం బ్లూ ఆరిజిన్‌ సంస్థను బెజోస్‌ 2000లో కెంట్‌లో ఏర్పాటుచేశారు. ఇప్పటికైతే ప్రజల కోసం టిక్కెట్లు సిద్ధంగా లేవు. కానీ వేలంపాటలో గెలుచుకున్నవారికి మాత్రం అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరివరకు మరో రెండు యాత్రలు జరపడానికి నిర్ణయించుకున్నామని బ్లూ ఆరిజిన్‌ సిఇఒ బాబ్‌ స్మిత్‌ పేర్కొన్నారు. ఇలా ఉంటే ఇప్పటివరకు 600లోపు ప్రజలే ఆకాశం అంచులు, ఆవలికి వెళ్లగలిగారు. ఇక తమ అంతరిక్ష యాత్రపై ఇది బ్రాన్సన్‌తో పోటీ మాత్రం కాదని, అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి యూరి గగారిన్‌ అని బెజోస్‌ స్పష్టంచేశారు. అయితే కొత్త తరాలు అంతరిక్షంలో అద్భుతాలు చేయడానికి మార్గం వేస్తున్నామని ఆయన వెల్లడించారు. కాగా కక్షలోకి ప్రజలు, పేలోడ్లను ప్రవేశపెట్డడానికి బ్లూ ఆరిజిన్‌ సంస్థ న్యూ గ్లెన్‌ అనే భారీ రాకెట్‌ను రూపొందిస్తోంది. ప్రతిపాదిత బ్లూ మూన్‌ ల్యాండర్‌ ద్వారా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించాలని బ్లూ ఆరిజిన్‌ కోరుకుంటోంది.

DO YOU LIKE THIS ARTICLE?