అంకితరైనా సంచలనం

సమంతా స్టోసర్‌పై విజయం
ఎనింగ్‌ (చైనా): భారత స్టార్‌ మహిళా టెన్నిస్‌ క్రీడాకారిణి అంకిత రైనా సంచలన విజయాన్ని నమోదు చేసింది. కున్‌మింగ్‌ ఓపెన్‌లో సమంతా స్టోసర్‌(ఆస్ట్రేలియా)ను ఓడించి రికార్డు సృష్టించింది. అంకిత తన కెరీర్‌ బెస్ట్‌ విజయాన్ని అందుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌లో భారత నంబర్‌ వన్‌, ఆసియా గేమ్స్‌ కాంస్య పతక విజేత అంకిత రైనా 7 2 7 తేడాతో ఆస్ట్రేలియా స్టార్‌, మాజీ యుఎస్‌ ఓపెన్‌ విజేత సమంతా స్టోసర్‌పై విజయం సాధించి రెండో రౌండ్‌లో దూసుకెళ్లింది. 26 ఏళ్ల అంకిత ఆరంభం నుంచే సమంతాకు గట్టిపోటీ నిచ్చింది. తొలి సెట్‌లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. అయితే చివర్లో ఆధిక్యంలో దూసుకెళ్లిన అంకిత 7 తొలి సెట్‌ను గెలుచుకుంది. తర్వాత జరిగిన రెండో సెట్‌లో పుంజుకున్న సమంతా అంకితపై విరుచుపడి వరుసగా పాయింట్లు సాధిస్తూ భారీ తేడాతో రెండో సెట్‌ను దక్కించుకుంది. ఇక మిగిలిన చివరి సెట్‌ ఇద్దరికి కీలకంగా మారింది. ఇందులో గెలిచిన వారే ముందుకు వెళ్తారు. ఈ సమయంలో తెలివిగా ఆడిన అంకిత రైనా అద్భుతంగా ఆడుతూ సీనియర్‌ సమంతాపై విరుచుకుపడింది. ఆఖరికి ఆధిక్యంలో దూసుకెళ్లి పై చెయి సాధించింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత స్టార్‌ 7 తేడాతో మూడో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకొని సంచలనాన్ని నమోదు చేసింది. ఇక రెండో రౌండ్‌లో అంకిత రైనా చైనాకు చెందిన కై లిన్‌ జాంగ్‌తో తలపడనుంది. ప్రస్తుతం ప్రపంచ 178వ ర్యాంక్‌లో కొనసాగుతున్న అంకిత రైనా.. భారత్‌ తరఫున మహిళల సింగిల్స్‌లో 200లోపు ర్యాంక్‌ సాధించిన మూడో క్రీడాకారిణిగా రికార్డు సాధించింది. అంతకుముందు సానియా మీర్జా , నిరుపమా వైద్యనాథన్‌లు ఈఫీట్‌ను అందుకున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?